Shanmuga Subramanian: నాసా కంటే ముందు విక్రమ్ జాడ కనిపెట్టిన చెన్నై యువకుడు! – chennai techie uses lro camera images to find vikram lander, gets credit from nasa

admin
Read Time6 Minute, 18 Second


చంద్రుడి ఉపరితలంపై దిగుతూ భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయిన విక్రమ్ ల్యాండర్ జాడ కోసం అంతరిక్ష శాస్త్రవేత్తలు, సంస్థలు దాదాపు మూడు నెలలు ముమ్మరంగా శోధించాయి. అయితే, నాసా ఎల్ఆర్‌వో పంపిన ఫోటోల ఆధారంగా తొలిసారి చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ షణ్ముగం సుబ్రమణ్యం (33) చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడు. చెన్నైలోని లెనొక్స్ ఇండియా టెక్నాలజీ సెంటర్‌లో టెక్నికల్ ఆర్కెటెక్ట్‌గా పనిచేస్తున్న షణ్ముగం సుబ్రమణ్యం (33) మెకానికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. స్వస్థలం మదురై.


షణ్ముగం గతంలో కాగ్నిజెంట్‌లో ప్రోగ్రామ్ ఎనలిస్ట్‌గా పనిచేశారు. నాసా లూనార్ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్ఆర్‌వో) సెప్టెంబరు 17, అక్టోబరు 14,15, నవంబరు 11న తీసిన ఫోటోలను పలు వారాల పాటు పరిశీలించి విక్రమ్ ల్యాండర్ శకలాలను షణ్ముగం గుర్తించారు. ఈ సమాచారాన్ని నాసాకు తెలియజేయగా, కొద్ది రోజుల తర్వాత దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ యువ శాస్త్రవేత్తకు నాసా ఎల్‌ఆర్ఓ మిషన్ డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లార్‌ ఓ లేఖ రాశారు.

Read Also:
Chandrayaan2 విక్రమ్ ఆచూకీ తెలిసింది.. శకలాలను గుర్తించిన నాసా


‘విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించి సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు.. నాసా ఎల్ఆర్వో బృందం ఇతర శకలాలను గుర్తించింది.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా అక్టోబర్ 14, 15, నవంబర్‌ 11న ఎల్‌ఆర్‌వో ప్రయాణించినప్పుడు తీసిన ఫోటోలు ఆధారంగా విక్రమ్ ఆచూకీని ధ్రువీకరించింది. విక్రమ్ ల్యాండింగ్‌కు ముందు, తర్వాత అక్కడ ప్రదేశానికి సంబంధించిన ఫోటోలను కూడా పరిశీలించారు.. మీరు పంపిన వివరాల ఆధారంగా మిగతా శకలాల గుర్తించడం కోసం నాసా సైంటిస్ట్‌లు ప్రయత్నించారు’ అని కెల్లార్ తన లేఖలో తెలిపారు.

Read Also: చంద్రయాన్-3 షురూ.. ఇస్రో లక్ష్యం అదే


షణ్ముగం కృషికి అభినందనలు తెలిపిన కెల్లార్.. ‘శకలాలను గుర్తించడం వెనుక చాలా సమయం, కృషి ఉందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.. ఆలస్యంగా మీకు సమాచారం అందజేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నాం. ఫలితాలను ప్రకటించే ముందు అన్ని అంశాలను నిర్ధారించుకోవడానికే కాలయాపన జరిగింది’ అన్నారు.

విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించినట్టు నాసా ప్రకటించిన విషయం తెలిసిందే. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని శాస్త్రవేత్త షణ్ముగం గుర్తించారని, అనంతరం ఎల్‌ఆర్‌వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను గుర్తించిందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీదుగా అక్టోబర్ 14, 15, నవంబర్‌ 11న ఎల్‌ఆర్‌వో ప్రయాణించినప్పుడు తీసిన ఫోటోలు వీటిని ధ్రువీకరించినట్లు ప్రకటించింది.

Read Also: chandrayaan-2: ఈ లోపమే కొంప ముంచింది.


నాసా ఎల్ఆర్‌వో తీసిన ఫోటోల్లో నీలి రంగులో ఉన్న చుక్కలు విక్రమ్ వల్ల ప్రభావితమైన చంద్రుడి ఉపరితలాన్ని.. ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చుక్కలు విక్రమ్‌ శకలాల్ని సూచిస్తున్నాయి. ‘ఎస్‌’తో సూచించిన శకలం షణ్ముగం సుబ్రహ్మణియన్‌ కనిపెట్టింది. విక్రమ్‌ శకలాలు పడడానికి ముందు, పడిన తర్వాత చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో కూడా నాసా చిత్రాలు విడుదల చేసింది.

చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2ను జులై 22న ప్రయోగించింది. జీఎస్‌ఎల్వీ మార్క్3 ఎమ్ 1 నౌక ద్వారా నింగిలోకి వెళ్లిన చంద్రయాన్-2 50 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యను చేరింది. తర్వాత ఆర్బిటర్, ల్యాండర్ విడిపోయాయి. అనంతరం విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి కక్ష్యలోకి అంచలంచెలుగా దించారు. చివరిసారిగా సెప్టెంబరు 7న ఉపరితలంపైకి దిగితూ చివరి నిమిషంలో ల్యాండర్‌తో భూ కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి.

Source link

0 0
Next Post

Chhattisgarh encounter: ఎన్‌కౌంటర్‌‌: నక్సలైట్లు అనుకుని 17 మంది అమాయకుల ప్రాణాలు తీశారు! - 17 innocent people killed in chhattisgarh encounter in 2012 weren't maoists says judicial report

మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఏడేళ్ల కిందట చత్తీస్‌గఢ్‌ పోలీసులు ఓ ఎన్‌కౌంటర్‌లో 17 మందిని హతమార్చారు. 2012 జూన్‌ 28 రాత్రి బీజాపూర్‌ జిల్లా సర్కేగూడలో జరిగిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో న్యాయవిచారణకు ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటుచేసింది. జ్యుడీషియల్ కమిటీ విచారణలో భయంకరమైన విషయం వెలుగుచూసింది. నాడు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయింది అమాయక గిరిజనులని తేలింది. పోలీసుల తప్పిదం వల్ల అమాయకుల ప్రాణాలు పోయినట్టు […]